England: పసికూనలపై ఇంగ్లండ్ రికార్డు విజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి..

  • ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన ఇంగ్లండ్
  • ఓడినా మనసులు గెలిచిన ఆప్ఘన్
  • సిక్సర్లతో చెలరేగిన మోర్గాన్

ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం ఇంగ్లండ్-ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన పోరు రికార్డులకెక్కింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఈ ప్రపంచకప్‌లోనే రికార్డు స్థాయిలో 397 పరుగులు చేయగా, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఏకంగా 17 సిక్సర్లు కొట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇక కొండంత విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘన్ జట్టు 150 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లలో తొలుత జానీ బెయిర్‌స్టో (90), జో రూట్ (88)లు ఆప్ఘాన్ బౌలర్లను చితక్కొట్టగా ఆ తర్వాత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 71 బంతుల్లో 4 ఫోర్లు, 17 సిక్సర్లతో 148 పరుగులు చేశాడు. దీంతో స్కోరు పాదరసంలా పరుగులు పెట్టింది. చివర్లో మెయిన్ అలీ 9 బంతుల్లో ఫోర్, నాలుగు సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆతిథ్య జట్టు ఆరు వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోరు చేసింది.

అనంతరం 398 పరుగుల భారీ విజయ లక్ష్యంలో బ్యాటింగ్ ప్రారంభించిన ఆప్ఘనిస్థాన్ ఏ దశలోనూ ఇంగ్లండ్‌కు పోటీ ఇవ్వలేకపోయింది. అయితే, కెప్టెన్ గుల్బాదిన్ నైబ్ (37), రహ్‌మత్ షా (46), హస్మతుల్లా షాహిది (76), అస్ఘర్ అఫ్ఘాన్ (44)ల పోరాట పటిమతో ఆప్ఘాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో8 వికెట్ల నష్టానికి 247 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఓడినా అభిమానుల మనసులు గెలుచుకుంది. 148 పరుగులతో పరుగుల సునామీ సృష్టించిన మోర్గాన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

More Telugu News