rapaka: కేంద్రంతో పోరాడే పరిస్థితి లేదు.. జనసేన ఎమ్మెల్యే ఏది పడితే అది మాట్లాడటం సరికాదు: శ్రీకాంత్ రెడ్డి

  • మిత్రపక్ష బీజేపీని ఒప్పించి హోదాను సాధించాలన్న రాపాక
  • రాపాక వ్యాఖ్యలను తప్పుబట్టిన శ్రీకాంత్ రెడ్డి
  • బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకోలేదని వ్యాఖ్య

మీ మిత్రపక్షమైన బీజేపీని ఒప్పించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలంటూ వైసీపీ ప్రభుత్వానికి జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాపాక సూచనపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకోలేదని... జనసేన ఎమ్మెల్యే ఏది పడితే అది మాట్లాడటం సముచితం కాదని అన్నారు. టీడీపీతో జనసేనకు ఉన్న అంతర్గత పొత్తు గురించి అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. కేంద్రంతో పోట్లాడే పరిస్థితి లేదని... బీజేపీతో సఖ్యతగా ఉంటూనే ప్రత్యేక హోదా సాధనకు కృషి చేస్తామని చెప్పారు.

అంతకు ముందు రాపాక మాట్లాడుతూ, మంత్రివర్గంలో బడుగు, బలహీనవర్గాలకు చోటు కల్పించడం శుభపరిణామమని కితాబిచ్చారు. ఎస్సీ సామాజికవర్గానికి హోంమంత్రి పదవి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఎస్సీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు మూతపడకుండా చూడాలని విన్నవించారు.

More Telugu News