earthquakes: చైనాను కుదిపేసిన రెండు భారీ భూకంపాలు.. 11 మంది మృతి

  • అరగంట తేడాతో రెండు భూకంపాలు
  • ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన ప్రజలు
  • 122 మందికి గాయాలు

సోమవారం రాత్రి రెండు భారీ భూకంపాలు చైనాను కుదిపేశాయి. నైరుతి ప్రావిన్స్‌లోని సిచువాన్‌లో అరగంట తేడాతో సంభవించిన భూకంపాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి.

ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 122 మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నట్టు స్థానిక మీడియా తెలిపింది. చెంగ్డు, చోంగ్‌కింగ్ నగరాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది.

భూకంప భయంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. కొన్ని భవనాలు బీటలు వారగా, కొన్ని కుప్పకూలాయి. శిథిలాల కింది చిక్కుకున్న వారిలో చాలామందిని వెలికి తీసినట్టు అధికారులు తెలిపారు. తొలి భూకంప తీవ్రత 5.9 కాగా, రెండో భూకంప తీవ్రత 5.2గా నమోదైనట్టు పేర్కొన్నారు. చాంగ్‌నింగ్ కౌంటీ సమీపంలో భూమికి పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. కాగా, 2008లో చైనాలో సంభవించిన భారీ భూకంపంలో 70 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News