Somu Veerraju: సీఐబీని రాష్ట్రానికి రాకుండా చేసి డీఐజీతో ప్రత్యర్థులందరిపై దాడి చేయించారు: గత ప్రభుత్వంపై సోము వీర్రాజు ఫైర్

  • మరుగుదొడ్ల నిర్మాణంలోనూ భారీ అవినీతి
  • ధాన్యాన్ని మిల్లర్లతో కొనిపించారు
  • రైతులకు ఇన్స్యూరెన్స్ డబ్బు కూడా ఇవ్వలేదు
  • చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ అవినీతికి పాల్పడింది

గత ప్రభుత్వ విధానాలపై ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. నేడు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో చాలా అవినీతి జరిగిందని, దానిపై దర్యాప్తు చేయాలని సీఎం జగన్‌ను కోరినట్టు తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలోనూ భారీ అవినీతి జరిగిందన్నారు. రైతుల వద్ద నేరుగా ధాన్యం కొనుగోలు చేయకుండా మిల్లర్లతో కొనిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు సంవత్సరాలుగా రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. సీబీఐని రాష్ట్రానికి రాకుండా చేసి డీఐజీతో ప్రత్యర్థులందరిపై దాడి చేయించారని సోము వీర్రాజు ఆరోపించారు.

చదరపు అడుగుకు రూ.10 వేల చొప్పున ఖర్చు చేసి చేపట్టిన అసెంబ్లీ నిర్మాణంలో ఏమాత్రం నాణ్యత లేదని, చిన్న వర్షానికి అసెంబ్లీ పైకప్పు లీక్ అవుతుందని, తడిసి పోతున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు సహా చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని వీటిపై దర్యాప్తు చేయించాలని జగన్‌ను కోరినట్టు తెలిపారు. శాసనమండలిలో టీడీపీ సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన ప్రసంగంపై సోము వీర్రాజు మాట్లాడుతూ, నాలుగు గంటల సమయమిస్తే రాజధాని గురించి మాత్రమే మాట్లాడారని, అసలు ప్రపంచంలో రాజధాని గురించి చర్చించిన సందర్భం ఉందా? అంటూ ప్రశ్నించారు. అనవసర చర్చ చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు.

More Telugu News