Cricket: చెలరేగిన యువక్రికెటర్లు... గేల్, రస్సెల్ డకౌట్ అయినా 321 పరుగులు చేసిన వెస్టిండీస్

  • బంగ్లాదేశ్ తో వరల్డ్ కప్ మ్యాచ్
  • తృటిలో సెంచరీ చేజార్చుకున్న విండీస్ వికెట్ కీపర్
  • ధాటిగా ఆడిన హెట్మెయర్, హోల్డర్, బ్రావో

వెస్టిండీస్ జట్టులో యువరక్తం పొంగిపొర్లుతోంది. విధ్వంసక బ్యాట్స్ మెన్ గా పేరుగాంచిన క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ కేవలం సున్నా పరుగులకే వెనుదిరిగినా, బంగ్లాదేశ్ తో వరల్డ్ కప్ మ్యాచ్ లో విండీస్ స్కోరు 300 మార్కు దాటిందంటే యువక్రికెటర్ల చలవేనని చెప్పాలి. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి కరీబియన్లకు బ్యాటింగ్ అప్పగించింది. మొదట ఓపెనర్ ఎవిన్ లూయిస్ 67 బంతుల్లో 70 పరుగులు చేసి జట్టుకు శుభారంభాన్నిచ్చాడు.

వికెట్ కీపర్ షై హోప్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. హోప్ 96 పరుగులు చేసి జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. నికొలాస్ పూరన్ (25), హెట్మెయర్ (50), కెప్టెన్ హోల్డర్ (33), డారెన్ బ్రావో (19) అందరూ కలిసికట్టుగా కదం తొక్కడంతో విండీస్ భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు సాధించింది.

హెట్మెయర్ కేవలం 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ ల సాయంతో అర్ధసెంచరీ సాధించాడు. కెప్టెన్ హోల్డర్ 15 బంతులాడగా, వాటిలో 4 ఫోర్లు, 2 సిక్స్ లున్నాయి. చివర్లో డారెన్ బ్రావో రెండు భారీ సిక్స్ లతో అలరించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజూర్ రెహ్మాన్, సైఫుద్దీన్ లకు చెరో 3 వికెట్లు లభించాయి. సీనియర్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ కు రెండు వికెట్లు దక్కాయి.

More Telugu News