Loksatta: సంపూర్ణ మద్య నిషేధం ఆచరణ సాధ్యం కాదు: ‘లోక్ సత్తా’ జేపీ

  • సంపూర్ణ మద్య నిషేధానికి, మద్య నియంత్రణకు చాలా తేడా ఉంది
  • మద్య నిషేధం ఎక్కడ అమలు చేసినా అవినీతికి ఆస్కారం ఉంటుంది
  • గత ప్రభుత్వాల అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలి

సంపూర్ణ మద్య నిషేధం ఆచరణ సాధ్యం కాదని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ (జేపీ) మరోమారు అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సంపూర్ణ మద్య నిషేధానికి, మద్య నియంత్రణకు చాలా తేడా ఉందని అన్నారు. మద్యానికి బానిసైన లక్షలాది పేద కుటుంబాలు నాశనమైపోతున్నాయని అన్నారు. మద్యం ప్రభావం పేద కుటుంబాలపై తీవ్రంగా ఉందన్న విషయంలో ఎటువంటి అనుమానం లేదని,అయితే, మద్య నిషేధం ప్రపంచంలో ఎక్కడ అమలు చేసినా కొంత కాలం తర్వాత అవినీతికి ఆస్కారం ఉంటుంది కనుక, కఠిన మద్య నియంత్రణ అమలు చేయడం అవసరమని అన్నారు.

ఏ గ్రామంలో అయితే మద్యం షాపు ఏర్పాటుకు ప్రజలు ఇష్టపడతారో అక్కడే వీటిని ఏర్పాటు చేయాలని, బహిరంగ మద్యపాన నిషేధం విధించాలని, మద్యం సేవించి వాహనం నడిపినా, చిన్న నేరం చేసినా కఠిన శిక్షలు విధించేలా ఉండాలని, మద్యానికి బానిసలైన వారికి డీ-అడిక్షన్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు.

మద్యానికి బానిసైన వారి సంఖ్యను తగ్గించకుండా, మద్యపాన నిషేధం కోసం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వాల అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. సామాన్యులకు, పేదలకు మద్యం అందుబాటులో లేకుండా చేయాలని, మద్యానికి బానిసలైన వారిని దాని నుంచి బయటపడేలా చేయాలని, అందుకోసం ఓ పద్ధతి ప్రకారం వెళితే కచ్చితంగా ఫలితాలు వస్తాయని అన్నారు.

More Telugu News