Andhra Pradesh: జగన్.. రాసుకో.. రాసుకో.. అన్న నేత కనిపించడం లేదేం?: దేవినేని ఉమకు అంబటి చురకలు!

  • అచ్చెన్నాయుడు మిస్సయి సభకు వచ్చేశారు
  • ఆయన్ను ఈసారి జగన్ చూసుకుంటారు
  • గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా అంబటి వ్యాఖ్య

ఏపీ మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఈరోజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో ఈరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం సందర్భంగా మాట్లాడుతూ..‘అధ్యక్షా.. మీ ద్వారా గౌరవ శాసనసభ్యులు అచ్చెన్నాయుడికి మనవి చేసుకుంటున్నా. సమర్థవంతమైన పాలన అందించినట్లు మీరు(అచ్చెన్నాయుడు) అనుకుంటేనో, మీ పక్కనున్న నాయుడు(చంద్రబాబు) అనుకుంటేనో సరిపోదు. ప్రజలు అనుకోవాలి. టీడీపీ మనుగడకే ప్రమాదం ఏర్పడేలా ప్రజలు తీర్పు ఇచ్చారు. కేవలం 23 మంది సభ్యులను గెలిపించారు. దీన్ని గమనించకపోతే దెబ్బతింటారు’ అని హెచ్చరించారు.

ప్రతిపక్ష టీడీపీ చేసే విమర్శలను తాము స్వాగతిస్తామనీ, ప్రభుత్వం సక్రమంగా పనిచేయాలంటే విమర్శలు అవసరమని అంబటి రాంబాబు అన్నారు. ‘‘మా ప్రభుత్వంపై సద్విమర్శ చేయండి. స్వాగతిస్తాం. అంతేతప్ప.. మీ అంతు చూస్తాం అని అన్ పార్లమెంటరీ భాషలో మాట్లాడటం తప్పు అవుతుంది. పోలవరం గురించి టీడీపీ సభ్యులు గతంలో ‘పోలవరం 70 శాతం  పూర్తి అయింది’ అన్నారు.

‘2019 నాటికి పోలవరం పూర్తిచేసి ఎన్నికలకు వెళతాం. రాసుకో.. రాసుకో.. జగన్.. రాసుకో’ అన్నారు. ఎక్కడండి.. ఆ రాసుకో.. రాసుకో అన్న నేత కనిపించడం లేదేం? ఎక్కడికి వెళ్లిపోయాడు? ఏం అయిపోయాడు. జగన్ ను దూషించినవాళ్లు, రాసుకో..రాసుకో అన్నవాళ్లు కనుమరుగు అయిపోయారు. కానీ పాపం అచ్చెన్నాయుడు  ఒక్కరే మిస్ అయిపోయి సభకు వచ్చేశారు. వారిని వచ్చేసారి సభానాయకుడు జగన్ చూసుకుంటారు’’ అని అంబటి  అంటించారు. 

More Telugu News