hyderguda: ఆధునిక హంగులతో తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస సముదాయం: ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

  • 4.26 ఎకరాల్లో రూ.126 కోట్లతో భవనాలు
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం 120 ఫాట్లు
  • ఒక్కో ఫ్లాట్‌ 2500 చదరపు అడుగుల విస్తీర్ణం

తెలంగాణ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, సిబ్బంది, సహాయకుల కోసం  ప్రభుత్వం ఆధునిక హంగులతో నిర్మించిన నూతన భవన సముదాయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. దాదాపు 4.26 ఎకరాల్లో రూ.126 కోట్లతో ఈ బహుళ అంతస్తు భవనాలను నిర్మించారు. మొత్తం 12 అంతస్తులతో ఐదు బ్లాకులు నిర్మించారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం మొత్తం 120 ప్లాట్లను ఒక్కొక్కటీ 2500 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు. అలాగే, సిబ్బంది కోసం మరో 36 ఫ్లాట్లను ఒక్కొక్కటీ వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు. సహాయకుల కోసం 120 ఫ్లాట్లను ఒక్కొక్కటీ 325 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫ్లాట్లలో పెద్దల పడకగది, పిల్లల పడకగది, కార్యాలయం, వంటగదితోపాటు స్టోర్‌ రూం ఉంటాయి.

గృహ సముదాయం ఆవరణలో ఒక భద్రతా కార్యాలయాన్ని కూడా నిర్మించారు. ఐటీ, మౌలిక సదుపాయాల కోసం 1.25 లక్షల చదరపు అడుగులతో  ప్రత్యేకంగా బ్లాక్‌ను నిర్మించారు. మొత్తం ఎనిమిది లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలకు ఆదర్శనగర్‌లో, హైదర్‌గూడలో పాత గృహ సముదాయాలున్నాయి. అవి శిథిలావస్థకు చేరడంతో 2012లో కొత్త వాటి నిర్మాణం చేపట్టారు. కానీ పూర్తి చేసేందుకు ఏడేళ్లు పట్టింది. హైదర్‌గూడలో జరిగిన కార్యక్రమంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

More Telugu News