Kinjarapu Acchamnaidu: అధ్యక్షా...పట్టిసీమ మోటార్లు ఆన్‌ చేయొద్దని అధికార పక్షాన్ని కోరుతున్నా: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు

  • అది వృథా ప్రాజెక్టు అని కదా వారి అభిప్రాయం
  • నీళ్లివ్వకుంటే రైతులు ఎలా స్పందిస్తారో వారికే తెలుస్తుంది
  • అప్పుడైనా ప్రాజెక్టు విలువేంటో  అర్ధమవుతుందని భావిస్తున్నా

అధ్యక్షా...పట్టిసీమ ప్రాజెక్టు మోటార్లను ఈ ఏడాది సీజన్ లో ఆన్‌చేయొద్దని అధికార పక్షానికి విజ్ఞప్తి చేస్తున్నానని మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి టీడీపీ శాసన సభ్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన అనంతరం ఆయన మాట్లాడుతూ ‘మాట్లాడితే పట్టిసీమ వృథా, వృథా అని అధికార పక్షం సభ్యులు  విమర్శిస్తున్నారని, అది నిజంగా వృథా ప్రాజెక్టు అని వారు భావిస్తే ఈ ఏడాది రైతులకు నీరివ్వకుండా, వారి స్పందన ఏమిటో చూడాలని మీ ద్వారా వారికి విజ్ఞప్తిచేస్తున్నాను’ అన్నారు.

అధికార పక్షం సభ్యులు ఎంతసేపు పట్టిసీమకు మా ప్రభుత్వం చేసిన ఖర్చునే చెపుతున్నారని, దానివల్ల ఒనగూరిన ప్రయోజనాలను కూడా చెబితే బాగుంటుందని చురకంటించారు. పట్టిసీమ నుంచి నీరివ్వకుంటే రైతుల ఆగ్రహం తెలిసి వస్తుందని, అప్పుడైనా వారికి ఆ ప్రాజెక్టు విలువ అర్ధమవుతుందని భావిస్తున్నానని అన్నారు.

ఇక రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 70 శాతం పూర్తి చేశామని, మిగిలిన 30 శాతం పనులు వేగంగా పూర్తిచేసి వారి చిత్తశుద్ధి చాటుకోవాలని సూచించారు. మేము చేయాల్సిందంతా చేసినా ఓడిపోయామని బాధపడుతున్నామని, అధికార పక్షం పనులు పూర్తిచేసి ప్రజల ఆకాంక్షను కాపాడాలని కోరారు.

More Telugu News