ICC World cup: ప్రధాని ఇమ్రాన్ సూచనలను పెడచెవిన పెట్టిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్

  • టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలన్న ఇమ్రాన్
  • స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్, బౌలర్లతో బరిలోకి దిగాలని సూచన
  • పూర్తి విరుద్ధంగా ప్రవర్తించిన సర్ఫరాజ్

పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చేసిన సూచనలను ఆ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పెడచెవిన పెట్టాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం మాంచెస్టర్‌లో చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం కనబరిచిన భారత్ 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు పాక్ ప్రధాని, 1992లో ఆ దేశానికి ప్రపంచకప్ అందించిన ఇమ్రాన్‌ఖాన్.. ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్‌కు ఓ సూచన చేశారు.

టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ ఎంచుకోవాలని ఇమ్రాన్ సూచించారు. అలాగే, స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్, బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించారు. పిచ్ మరీ తేమగా ఉంటే తప్ప టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగే చేయాలని, ఒత్తిడి ఉంటే పార్ట్ టైమర్లు రాణించలేరని పేర్కొన్నారు. అయితే, ఇమ్రాన్ సూచనకు పూర్తి విరుద్ధంగా సర్ఫరాజ్ నిర్ణయం తీసుకున్నాడు. టాస్ గెలవగానే భారత్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. బ్యాటింగ్ పిచ్ అని తెలిసినా సర్ఫరాజ్ బౌలింగ్ ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, మాంచెస్టర్‌లో గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతుండడంతో పిచ్‌పై తేమను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే సర్ఫరాజ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  

More Telugu News