punjab: ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి బ్రేక్.. స్కూళ్లలో యూనిఫాం, పుస్తకాల అమ్మకాలను నిషేధించిన పంజాబ్

  • తమ షాపుల్లో కొనాలని ఒత్తిడి చేయలేరని స్పష్టీకరణ
  • అన్ని పాఠశాలలకు ఈ నిబంధనలు వర్తిస్తాయన్న ప్రభుత్వం
  • మూడేళ్ల పాటు యూనిఫాం రంగు, డిజైన్ మార్చరాదని ఆదేశం

పాఠశాలలు మొదలు అయ్యాయంటే చాలు తల్లిదండ్రుల గుండెల్లో దడ మొదలవుతుంది. యూనిఫాంలు, పుస్తకాలు, ఆ ఫీజు.. ఈ ఫీజు అంటూ ఏడాది పాటు దాచుకున్న డబ్బంతా హారతి కర్పూరంలా ఖర్చు అయిపోతుంది. దీనికితోడు యూనిఫాంలు, పుస్తకాలు తమ దగ్గరే కొనాలని చాలా పాఠశాలలు అడ్డగోలు నిబంధనలు పెడుతుంటాయి. తాజాగా అలాంటి ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేసేలా పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల ప్రాంగణంలో యూనిఫాంలు, పుస్తకాలు, టెక్ట్స్ బుక్కుల అమ్మకాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

సీబీఎస్ఈ ప్రైవేటు స్కూళ్లు, ఐసీఎస్ ఈ పాఠశాలలు, పంజాబ్ స్కూలు ఎడ్యుకేషన్ బోర్డు పరిధిలోని పాఠశాలలు అన్నింటికి ఈ నిబంధనలు వర్తిస్తాయని పంజాబ్ విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్లా తెలిపారు. తమ షాపులోనే పుస్తకాలు, యూనిఫాంలు కొనాలని పాఠశాలలు తల్లిదండ్రులపై ఒత్తిడి చేయరాదని స్పష్టం చేశారు. ఓసారి పాఠశాలల యూనిఫాంను ఎంపిక చేస్తే రాబోయే మూడేళ్లు అదే దుస్తులను వాడాలనీ, ఏటా యూనిఫాం రంగులు, డిజైన్లు మార్చడం కుదరదని తేల్చిచెప్పారు. పుస్తకాలు ఎక్కడ కొనాలన్న విచక్షణాధికారాన్ని తల్లిదండ్రులకే వదలిపెట్టాలని ఇందర్ సింగ్లా అన్నారు.

More Telugu News