Andhra Pradesh: ఆరోజు కావాలనే పవన్ కల్యాణ్ అమలాపురం సభకు వెళ్లలేదు!: జనసేన ఎమ్మెల్యే రాపాక

  • మేం అప్పటికే ర్యాలీ ప్లాన్ చేసుకున్నాం
  • ఇందుకోసం పోలీసుల అనుమతి తీసుకున్నాం
  • చివరికి నిమిషంలో పవన్ సభ బాధ్యతలు చేపట్టాలని ఫోన్ చేశారు

ఇటీవల ముగిసిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నుంచి రాపాక వరప్రసాద్ ఒక్కరే విజయం సాధించారు. రాజోలు నుంచి పోటీ చేసిన ఆయన తన సమీప ప్రత్యర్థిపై స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. అయితే ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమలాపురంలో సభ నిర్వహించగా, రాపాక గైర్హాజరు అయ్యారు. దీనిపై అప్పట్లో రకరకాల కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఘటనపై రాజోలు ఎమ్మెల్యే స్పందించారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు తాను ఓ ర్యాలీని పెట్టుకున్నాననీ, అందుకు పోలీసుల నుంచి అనుమతి కూడా తీసుకున్నానని రాపాక తెలిపారు.

‘నరసాపురం సకినేటిపల్లి రేవు నుంచి జగ్గయ్యపేట వరకూ ర్యాలీని ప్లాన్ చేశాం. కానీ అదే రోజు అమలాపురంలో పవన్ కల్యాణ్ సభ పెడుతున్నారు. మీరే ఏర్పాట్లు చూసుకోవాలి అని పార్టీ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ఎన్నికల సభకు ఏర్పాట్లు చేయాలంటే రెండ్రోజులు పడుతుంది కాబట్టి.. తాను అమలాపురం సభకు వెళ్లలేదు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి స్పష్టం చేశా. మరుసటి రోజు పాలకొల్లులో జరిగిన బహిరంగ సభకు వెళ్లాను. ఎందుకు హాజరుకాలేకపోయానో పార్టీ అధినేతకు చెప్పా. అనంతరం అక్కడి నుంచి వెనక్కి వచ్చేశా’ అని రాపాక వరప్రసాద్ అన్నారు.

More Telugu News