న్యూజిలాండ్ లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీచేసిన అధికారులు!

16-06-2019 Sun 10:39
  • 7.2 తీవ్రతతో ప్రకంపనలు
  • తొలుత సునామీ హెచ్చరికలు.. అనంతరం ఉపసంహరణ
  • భారీగా అలలు ఎగిసిపడే ఛాన్స్
న్యూజిలాండ్ లో ఈరోజు భారీ భూకంపం సంభవించింది. ఈశాన్య న్యూజిలాండ్ కు 300 కిలోమీటర్ల దూరంలో ఈరోజు రిక్టర్ స్కేలుపై 7.2  తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ సందర్భంగా న్యూజిలాండ్ పౌరరక్షణ సంస్థ సునామీ హెచ్చరికలను జారీచేసింది. దీంతో ప్రజలంతా ఎత్తయిన ప్రాంతాలకు పరుగులు తీశారు.

అయితే 8 నిమిషాల అనంతరం ఈ హెచ్చరికలను న్యూజిలాండ్ ఉపసంహరించుకుంది. సునామీ హెచ్చరికలు వెనక్కి తీసుకున్నప్పటికీ న్యూజిలాండ్ తీరంలో భారీగా అలలు ఎగిసిపడతాయని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రజలు తీరప్రాంతానికి దూరంగా ఉండాలని సూచించింది. కాగా, భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.