Arizona: తల్లిదండ్రులకు తెలియకుండా బొమ్మను తీసుకున్న నాలుగేళ్ల చిన్నారి.. తలపై తుపాకి గురిపెట్టి కాల్చేస్తానన్న పోలీసు

  • కారు నుంచి బయటకు లాగి దాడి చేసి బేడీలు వేసిన పోలీసులు
  • తుపాకి గురిపెట్టి కాల్చేయబోతున్నామంటూ బెదిరింపు
  • కోర్టును ఆశ్రయించిన బాధితులు

తల్లిదండ్రులకు తెలియకుండా ఓ చిన్నారి ఓ షాపు నుంచి బొమ్మను తీసుకుంది. అది గమనించిన ఓ పోలీసు నేరుగా వచ్చి చిన్నారి తల్లిదండ్రుల ముఖానికి తుపాకి గురిపెట్టాడు. కాల్చేస్తానంటూ భయపెట్టాడు. వారిని కారులోంచి ఈడ్చి పడేశాడు. అమెరికాలోని ఫోనిక్స్‌లో జరిగిందీ ఘటన. అరిజోనాకు చెందిన డ్రావోన్ అమెస్-లెషాలు తమ ఇద్దరు చిన్నారులతో కలిసి గత నెల 29న ఫోనెక్స్‌లోని ఓ ఫ్యామిలీ డాలర్ స్టోర్‌కు వెళ్లారు. స్టోర్‌లో వారి నాలుగేళ్ల చిన్నారి ఓ బొమ్మను చూస్తూ వారికి తెలియకుండా వెంట తెచ్చుకుంది.

అనంతరం వారు వెళ్లేందుకు సిద్ధమై కారు వద్దకు వచ్చారు. అయితే, వారిని గమనించిన ఓ పోలీసు కారు వద్దకు వచ్చి వారి ముఖాలకు తుపాకి గురిపెట్టాడు. ‘ఇప్పుడు మీ ముఖాలు పేలిపోబోతున్నాయి. మిమ్మల్ని కాల్చేస్తున్నా’ అంటూ కారులో కూర్చున్న వారిపై తుపాకి ఎక్కుపెట్టాడు.

అంతేకాదు, డ్రావోన్‌ను కారులోంచి కిందికి లాగి అతడి తలను పేవ్‌మెంట్‌కేసి బలంగా బాదాడు. అనంతరం చేతులకు బేడీలు వేశాడు. ఆ తర్వాత కూడా కాళ్లతో తంతూ దాడిచేశాడు. ఆపకుండా ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. మరో పోలీసు గర్భంతో ఉన్న లెషాను కారు నుంచి బయటకు లాగాడు.

ఆమె చేతిలోని బిడ్డను లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత ఆమెకు కూడా బేడీలు వేశారు. అయితే, ఆ తర్వాత కాసేపటికే వారిని వదిలిపెట్టారు. తమకు జరిగిన అవమానంపై కోర్టుకెక్కారు. తమను అన్యాయంగా నిర్భందించారని, అరెస్ట్ చేసి బెదిరించారంటూ అరిజోనా పోలీసులపై కోర్టులో దావా వేశారు.

More Telugu News