JC: టీడీపీకి చంద్రబాబే దిక్కు.. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడొస్తే కొన్నాళ్లకు నాయకుడు అవ్వొచ్చేమో!: జేసీ

  • సినిమా వాళ్లను చూడ్డానికే జనాలు వస్తారు
  • నటులను రాజకీయంగా ఆమోదించడం కష్టం
  • రాజకీయాలు సరిపడవని పవన్ కు కూడా చెప్పాను

నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు వెల్లడిస్తారని పేరున్న రాజకీయనేతల్లో జేసీ దివాకర్ రెడ్డి ముందువరుసలో ఉంటారు. ఏ పార్టీలో ఉన్నా అధినేతలకు సైతం సలహాలు ఇవ్వగల తెగువ జేసీకి ఉందంటారు. ఆయన వ్యాఖ్యలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది. తాజాగా ఓ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీ భవిష్యత్ నాయకత్వంపై స్పందించారు. తెలుగుదేశం పార్టీకి ఇకముందు కూడా చంద్రబాబే దిక్కని, ఆయన తప్ప మరో నాయకత్వంలేదని స్పష్టం చేశారు.

టీడీపీ తో ముడిపడి జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తున్నా, ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే కొన్నాళ్లకు నాయకుడు అవ్వొచ్చేమో తప్ప ఆయన గురించి ఇప్పుడేమీ చెప్పలేమని అన్నారు. "పవన్ కల్యాణ్ అంతటివాడికి కూడా రాజకీయాలు సరిపడవని చెప్పాను. పవన్ కు ఎంత పేరుంది? మిమ్మల్ని చూడ్డానికి జనం వస్తారే తప్ప వారంతా మీ వెంట నడిచేవాళ్లు కాదని చెప్పాను. చిరంజీవి, రోజా ఇలా ఎంతోమంది సినిమావాళ్లు రాజకీయాల్లోకి వచ్చారు. తెరపై నటించే ఆ నటులను చూడ్డానికి జనం వస్తారే తప్ప వాళ్లను రాజకీయంగా ఆమోదించడం చాలా కష్టం" అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు.

More Telugu News