Chattisgarh: పెళ్లిమంటపంలో పిలవని పేరంటం!... పరుగులు తీసిన వధూవరులు!

  • పెళ్లి వేడుకలో ప్రత్యక్షమైన ఎలుగుబంటి
  • వంటకాల వాసనకు ఆకర్షితురాలైన వైనం
  • బంధించిన అటవీశాఖ అధికారులు

చత్తీస్ గఢ్ లోని మహాసముంద్ ప్రాంతంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ పెళ్లి జరుగుతుండడంతో వధూవరుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పెళ్లివేదిక కోలాహలంగా ఉంది. పచ్చనితోరణాలు, కొత్త దుస్తుల కళకళతో పెళ్లిమంటపం వెలిగిపోతోంది. ఓవైపు విందు కోసం తయారవుతున్న వంటకాల ఘుమఘుమలు అతిథులకు నోరూరిస్తున్నాయి. ఇంతలో అనుకోని అతిథిలా ఓ ఎలుగుబంటి పెళ్లిమంటపంలోకి ఎంటరైంది.

వంటకాల వాసన పసిగట్టిన ఆ వన్యమృగం నేరుగా వంటశాల వద్దకు వెళ్లింది. దాంతో, వండుతున్న వంటలు అలాగే వదిలేసి వంటవాళ్లు బతుకు జీవుడా అనుకుంటూ పరుగులు తీశారు. ఈ విషయం తెలిసి పెళ్లికొడుకు, పెళ్లికూతురు, పురోహితుడు సహా అందరూ పరుగులు పెట్టారు. అతిథులు సరేసరి! తలో దిక్కుకు పారిపోయారు. అయితే, కొందరు ధైర్యవంతులైన యువకులు ఆ ఎలుగుబంటిని నిలువరించి సమీపంలోని అటవీప్రాంతంలోకి తరిమివేసేందుకు ప్రయత్నించగా, ఆ ఎలుగు నీళ్లులేని బావిలో పడిపోయింది. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, వలలో దాన్ని బంధించి రక్షిత అటవీప్రాంతంలో వదిలిపెట్టారు.

More Telugu News