Digvijay Singh: ఆయన ఓడిపోయారుగా.. నేను సజీవ సమాధి చేసుకుంటా.. అనుమతివ్వండి!: కలెక్టర్‌కు దరఖాస్తు చేసిన సాధువు

  • ప్రస్తుతం కమాఖ్యధామ్‌లో నివాసముంటున్నా
  • 16న సజీవ సమాధి చేసుకునేందుకు అనుమతించండి
  • నాకు అధికారులు సహకరిస్తారని భావిస్తున్నా

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భోపాల్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ ఓటమి పాలవడం ఓ సాధువుగారి ప్రాణాల మీదకి వచ్చింది. డిగ్గీరాజా విజయం కోసం స్వామి వైరాగ్యానంద అనే సాధువు పూజలు, యాగాలు నిర్వహించారు. దీంతో ఎన్నికల్లో డిగ్గీరాజా విజయం ఖాయమని, లేదంటే తాను సజీవ సమాధి చేసుకుంటానని తెలిపారు. అయితే భోపాల్‌లో బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ విజయం సాధించారు.

దీంతో డిగ్గీరాజా ఓటమి సాధువు చావుకొచ్చిందంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు వేస్తున్నారు. విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన వైరాగ్యానంద తన లాయర్ సాయంతో భోపాల్ కలెక్టర్‌ తరుణ్‌ కుమార్ పిఠోడేకి తనని తాను సజీవ సమాధి చేసుకునేందుకు అనుమతించాలని దరఖాస్తు చేశారు. ప్రస్తుతం తాను కమాఖ్యధామ్‌లో నివాసముంటున్నానని, ఎన్నికల సందర్భంగా తాను ఇచ్చిన మాట ప్రకారం జూన్ 16న మధ్యాహ్నం 2:11 గంటలకు సమాధి చేసుకోవడానికి అనుమతించాలని కోరారు.

అందుకుగాను స్థలాన్ని కేటాయించి తన మత సంప్రదాయాల్ని గౌరవించేలా అధికారులు తనకు సహకరిస్తారని విశ్వసిస్తున్నానని దరఖాస్తులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ తరుణ్ అనుమతిచ్చేదే లేదని స్పష్టం చేశారు. అలాగే వైరాగ్యానంద ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా జాగ్రత్త తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు.

More Telugu News