Mamata banerjee: ప్రధాని అధ్యక్షతన నేడు నీతి ఆయోగ్ సమావేశం.. రావట్లేదన్న మమత

  • నీతి ఆయోగ్ వేస్ట్ అన్న మమత
  • దాని కంటే ప్రణాళిక సంఘం బెటరని అభిప్రాయం
  • ప్రధానికి మూడు పేజీల లేఖ

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నేడు జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి హాజరు కావడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నీతి ఆయోగ్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఇది వరకే చెప్పిన మమత.. ఈ సమావేశానికి తాను హాజరు కావడం లేదంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే దాని ఎజెండాను రూపొందించారని, ఈ సమావేశానికి హాజరు కావడం నిరర్ధకమని మోదీకి రాసిన మూడు పేజీల లేఖలో మమత పేర్కొన్నారు. అయితే, ఈ సమావేశానికి తన తరపున ఎవరైనా హాజరు అవుతున్నదీ లేనిదీ మాత్రం వెల్లడించలేదు.

కాగా, నీతి ఆయోగ్ కంటే ప్రణాళిక సంఘమే మెరుగైనదని, దానిని తిరిగి తీసుకురావాలని విలేకరులతో మాట్లాడుతూ మమత అభిప్రాయపడ్డారు. సమావేశాలకు ముందు ప్రణాళిక సంఘం రాష్ట్రాలను సంప్రదించేదని, సమస్యలు పరిష్కరించేదని అన్నారు. ప్రణాళిక సంఘాన్ని తిరిగి తీసుకురావాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులకు లేఖలు రాసినట్టు మమత తెలిపారు. కాగా, నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరు కావడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ పనులకు సంబంధించి బిజీగా ఉండడంతో ఆయనీ నిర్ణయం తీసుకున్నారు.

More Telugu News