Telangana: ఒవైసీ కోసమే ముస్లిం రిజర్వేషన్లు కావాలని కేసీఆర్ అడుగుతున్నారు!: బీజేపీ నేత లక్ష్మణ్

  • మా గెలుపును టీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది
  • అందుకే, రాజకీయ దాడికి దిగుతోంది
  • తెలంగాణలో అధికారంలోకి రావడమే మా లక్ష్యం

తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ నిప్పులు చెరిగారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒవైసీ కోసమే ముస్లిం రిజర్వేషన్లు కావాలని కేసీఆర్ అంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతులు, హైవేల నిర్మాణానికి కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల విషయమై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు సీఎం కేసీఆర్ సిద్ధమేనా అని ప్రశ్నించారు.

తమ గెలుపును జీర్ణించుకోలేక టీఆర్ఎస్ రాజకీయ దాడికి దిగుతోందని విమర్శించారు. ఢిల్లీలో అమిత్ షా, సుష్మాస్వరాజ్, అద్వానీని కలిశామని, తెలంగాణలో బీజేపీ సాధించిన విజయానికి వారు ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని అమిత్ షా తమకు సూచించినట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని లక్ష్మణ్ స్పష్టం చేశారు.

పక్క రాష్ట్రం ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని, ఐఆర్ ప్రకటించి, సీపీఎస్ ను రద్దు చేశారని, మరి, తెలంగాణలో ఎందుకు చేయరని ప్రశ్నించారు. కేసీఆర్ వీటిని ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావట్లేదని అన్నారు. తెలంగాణలో ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లను అమలు చేయట్లేదని లక్ష్మణ్ విమర్శించారు. 

More Telugu News