TTD: నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు..రాజీనామా చేయను: టీటీడీ చైర్మన్ పుట్టా

  • స్విమ్స్ లో ఉద్యోగాల భర్తీలో అవినీతికి పాల్పడ లేదు
  • ఆ ఆరోపణలు విని చాలా బాధపడ్డాను
  • విచారణ నిర్వహించి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్  (స్విమ్స్ ) లో ఉద్యోగాల భర్తీ విషయమై అధికారులపై ఒత్తిడి తెచ్చానని, అవినీతికి పాల్పడ్డానని తనపై వచ్చిన ఆరోపణలు విని తాను చాలా బాధపడ్డానని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆరోపణలు చేయడానికి ఓ అర్థంపర్థం ఉండాలని విమర్శించారు. తాను రాజకీయ నాయకుడిని అని, పనుల నిమిత్తం ప్రజలు తన దగ్గరకు వస్తూ ఉంటారని అన్నారు. ఉద్యోగాలు ఇప్పించాలని తన దగ్గరకు వచ్చిన వారు కోరితే ఒకరికో, ఇద్దరికో రిఫరెన్స్ లెటర్ ఇచ్చానని అన్నారు. అయినా, తన సిఫారసు లెటర్ చూసి వారికేమీ ఉద్యోగాలు ఇవ్వలేదని  చెప్పారు. నిబంధనల ప్రకారమే ఉద్యోగాలు ఇస్తారన్న విషయం తనపై ఆరోపణలు చేసిన వారికి తెలియదా? అని ప్రశ్నించారు.

అధికారులందరూ తమపై కక్ష గట్టి చేసిన డ్రామా ఇది అని, నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు భర్తీ చేయాలని వారు చూశారని, అలా చేయొద్దని తాను వారికి ఓ అప్లికేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తాము ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, అవసరమైతే, విచారణ నిర్వహించి ఎవరు తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీటీడీ చైర్మన్ పదవికి తనను రాజీనామా చేయమని కొందరు అంటున్నారని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తాను తప్పకుండా తన పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

More Telugu News