Venkaiah Naidu: పోలవరం ప్రాజక్టు గురించి కేంద్ర మంత్రి షెకావత్ కు ప్రత్యేకంగా వివరించిన వెంకయ్యనాయుడు

  • కేంద్రం సంపూర్ణ సహకారం అందించాలి
  • రాష్ట్రానికి తోడ్పాటునందించాలి
  • గోదావరి, పెన్నా నదులను కావేరితో అనుసంధానించాలన్న ఉపరాష్ట్రపతి

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పోలవరం ప్రాజక్టు గురించి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కు ప్రత్యేకంగా వివరించారు. షెకావత్ ఇవాళ వెంకయ్యనాయుడ్ని కలిశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పోలవరం అంశం చర్చకు వచ్చింది. పోలవరం ప్రాజక్టుకు కేంద్రం సంపూర్ణ సహకారం అందించాలని వెంకయ్య కేంద్రమంత్రికి సూచించారు. 1981-82లో పోలవరం ప్రారంభమైందని, ఈ ప్రాజక్టు త్వరితగతిన పూర్తయ్యేందుకు రాష్ట్రానికి తోడ్పాటునందించాలని కోరారు.

రూ.3,000 కోట్లు విడుదల చేయాలని ఏపీ సర్కారు కేంద్రాన్ని కోరిందని ఈ సందర్భంగా వెంకయ్య వెల్లడించారు.  ఈ మొత్తాన్ని నాబార్డు ద్వారా విడుదల చేసేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని వెంకయ్య సూచించారు. నిధుల కొరతతో ప్రాజక్టు ఆలస్యం కారాదన్నదే తన అభిమతం అని స్పష్టం చేశారు.  ప్రాజక్టు విస్తరణలో అడ్డంకులపై పర్యావరణశాఖతో మాట్లాడాలని మంత్రికి సూచించారు.  

కాగా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచనలపై కేంద్రమంతి షెకావత్ సానుకూలంగా స్పందించారు. ఆర్థికశాఖతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి నదుల అనుసంధానంపైనా మాట్లాడారు. గోదావరి, పెన్నా నదులను కావేరీ నదితో అనుసంధానించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ అభివృద్ధికి నదుల అనుసంధానం ఎంతో అవసరమని అన్నారు. 

More Telugu News