Andhra Pradesh: కోడెల కుటుంబం ఒక్కో పనికీ లక్షకు రూ.20,000 చొప్పున వసూలు చేసింది!: వైసీపీ నేత, నటుడు పృథ్వీ

  • వైఎస్సార్ కంటి వెలుగు కోసం సత్తెనపల్లి వెళ్లా
  • అప్పుడే మొదటిసారి ‘కె ట్యాక్స్’ గురించి విన్నాను
  • ప్రతీపనికి లంచం వసూలు చేస్తున్నారు

గతంలో తాను ఓసారి సత్తెనపల్లి వెళ్లినప్పుడు కోడెల కుటుంబం వసూలు చేస్తున్న ‘కె’ ట్యాక్స్ గురించి విన్నానని వైసీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి, నటుడు పృథ్వీ తెలిపారు. సినీనటులం కాబట్టి తాము జీఎస్టీ కడతామనీ, వాహనాలు కొనుగోలు చేస్తే రోడ్ ట్యాక్స్, ఇతర పన్నులు కడతామని చెప్పారు. కానీ సత్తెనపల్లిలో ‘వైఎస్సార్ కంటివెలుగు’ కార్యక్రమానికి హాజరైనప్పుడు తొలిసారి ఈ ‘కోడెల ట్యాక్స్’ గురించి విన్నానని అన్నారు.

అక్కడ దిగగానే స్థానికులు కొందరు.. ‘‘సార్ ఇక్కడ బిల్డింగులు కట్టాలంటే లంచం ఇవ్వాలండి. ఓ కార్యక్రమం ప్రారంభించాలన్నా, కాంప్లెక్సులు కట్టాలన్నా ‘కె ట్యాక్స్ కట్టాలండి. రూ.లక్షకు గానూ ఓ రూ.20,000 వీరికి చెల్లించుకోవాలి అని వాపోయారు. కోడెల పీఏ ప్రసాద్ ప్రజలను బెదిరించడం, వసూలు చేయడం ప్రారంభించాడు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయాల్సిన దౌర్భాగ్యం తమకు పట్టలేదని దుయ్యబట్టారు. కాగా, బెదిరింపులు, బలవంతపు వసూళ్లపై టీడీపీ నేత కోడెల కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మిలపై ఇప్పటివరకూ 14 కేసులు నమోదు అయ్యాయి. దీంతో వీరిద్దరూ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

More Telugu News