West Bengal: హిట్లర్‌లా వ్యవహరిస్తారా?.. వెంటనే రాజీనామా చేయండి: మమతపై విపక్షాల మండిపాటు

  • మూడు రోజులుగా కొనసాగుతున్న వైద్యుల సమ్మె
  • విరమించుకోకుంటే చర్యలు తప్పవన్న సీఎం
  • సీఎంగా, వైద్య మంత్రిగా విఫలమయ్యారని విపక్షాల మండిపాటు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమ్మె చేస్తున్న వైద్యులపై ముఖ్యమంత్రి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు తక్షణం ఆమె వైద్యశాఖా మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైద్యుల సమస్యను పరిష్కరించాల్సింది పోయి హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని బీజేపీ, సీపీఎంలు విరుచుకుపడుతున్నాయి.

తమకు రక్షణ కల్పించాల్సిందిగా గత మూడు రోజులుగా సమ్మె చేస్తున్న వైద్యులు వెంటనే విరమించి విధుల్లో చేరాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని మమత ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోని వైద్యులు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

వైద్యులపై సానుభూతి ప్రకటించాల్సింది పోయి బెదిరించడం ఏమిటని మమతపై ప్రతిపక్షాలు దాడి మొదలుపెట్టాయి. అధికార బలంతో హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని, ఇది సిగ్గుచేటని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా, వైద్య మంత్రిగా ఆమె విఫలమయ్యారని పేర్కొన్నాయి. వెంటనే ఆమె తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.

More Telugu News