West Bengal: బెంగాల్ లో మతం రంగు పులుముకున్న వైద్యుల సమ్మె.. బీజేపీపై మమత సంచలన వ్యాఖ్యలు

  • కోల్‌కతాలో మూడు రోజులుగా వైద్యుల సమ్మె
  • ముస్లిం రోగులకు చికిత్స చేయవద్దంటూ బీజేపీ నుంచి ఆదేశాలు ఉన్నాయన్న మమత
  • ఆసుపత్రులకు మమత లేఖ

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో గత మూడు రోజులుగా జరుగుతున్న వైద్యుల సమ్మె మతం రంగు పులుముకుంది. వైద్యుల సమ్మెలోకి బీజేపీని లాగిన ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకు బీజేపీ చీఫ్, హోంమంత్రి ప్రయత్నిస్తున్నారని మమత ఆరోపించారు. ముస్లిం రోగులకు వైద్యం చేయవద్దని బీజేపీ నుంచి వైద్యులకు ఆదేశాలు వెళ్లాయని సంచలన ఆరోపణలు చేశారు. రోగులను హిందూ-ముస్లింలుగా ఎలా విభజిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలోనూ, ఇప్పుడూ ఆ పార్టీ ప్రమాదకరమైన ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

కాగా, సమ్మెకు దిగిన నీల్ రతన్ సిర్కార్ (ఎన్ఆర్‌ఎస్) మెడికల్ కాలేజీ సీనియర్ వైద్యులు, ప్రొఫెసర్లు, ఆసుపత్రులకు మమత లేఖ రాశారు. సమ్మె కారణంగా వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని, రోగులను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. జిల్లాల నుంచి వచ్చిన  చాలామంది పేద రోగులు చికిత్స పొందుతున్న విషయాన్ని మర్చిపోవద్దని కోరారు.

ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ చనిపోయిన వ్యక్తి బంధువులు ఓ వైద్యుడిపై దాడిచేశారు. ఈ ఘటనలో వైద్యుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో తమకు రక్షణ కల్పించాల్సిందిగా వైద్యులు సమ్మెకు దిగారు. సమ్మె పిలుపుతో ఎమర్జెన్సీ వార్డులు, అవుట్ డోర్ సేవలు, పాథలాజికల్ యూనిట్లతోపాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులు మూతపడ్డాయి. మూడు రోజులుగా జరుగుతున్న ఈ సమ్మెతో రోగులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.

More Telugu News