కోడెల కొడుకు, కుమార్తెపై మరిన్ని ఫిర్యాదులు!

13-06-2019 Thu 17:33
  • కోడెల కూతురుపై యాసిన్ అనే వ్యక్తి ఆరోపణలు
  • ఉద్యోగం ఇప్పిస్తానని రూ.5 లక్షలు తీసుకుంది
  • శివరామ్ పై హరి ప్రియ వైన్ షాపు యజమాని ఫిర్యాదు

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామ్, కూతురు విజయలక్ష్మీపై ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా, నరసరావుపేటలో విజయలక్ష్మిపై యాసిన్ అనే వ్యక్తి ఆరోపణలు చేశాడు. విద్యుత్ శాఖలో తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.5 లక్షలు ఆమె తీసుకుందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ఉద్యోగం ఇప్పించకపోగా తనపై ఆమె బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.

మరోవైపు, నరసరావుపేటలో కోడెల శివరామ్ పై హరిప్రియ వైన్ షాపు యజమాని మర్రిబోయిన చంద్రశేఖర్ ఆరోపణలు చేశాడు. శివరామ్ తనను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, మొత్తం రూ.50 లక్షలు ఇవ్వమన్నారని, తాను రూ.44 లక్షలు ఇచ్చినట్టు చెప్పారు. మిగిలిన ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలని తనను బెదిరిస్తున్నారని నరసరావుపేట టూ టౌస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కాగా, తాజా ఘటనలతో కోడెల కుటుంబంపై మొత్తం నమోదైన ఫిర్యాదుల సంఖ్య పదికి చేరుకుంది.