Chandrababu: నేను అందుకే తమ్మినేనితో పాటు కుర్చీ వద్దకు రాలేదు: వివరణ ఇచ్చిన చంద్రబాబు

  • కనీసం ముందుగా చెబుతారని అనుకున్నాం
  • ప్రొటెం స్పీకర్ కూడా మమ్మల్ని పిలవలేదు
  • ఇష్టమైతే రండి, లేకుంటే లేదన్నట్టుగా ప్రవర్తించారు
  • అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబు

ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఎన్నికైన తరువాత సంప్రదాయం ప్రకారం, అధికార, విపక్ష నేతలు స్వయంగా స్పీకర్ ను ఆయన స్థానం వద్దకు తీసుకుని వెళ్లాల్సి వుండగా, విపక్ష నేత చంద్రబాబు రాలేదన్న సంగతి తెలిసిందే. స్పీకర్ కు ధన్యవాదాలు చెప్పే సమయంలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే విషయమై విమర్శలు గుప్పిస్తుండగా, చంద్రబాబు వివరణ ఇచ్చారు.

ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న తమ్మినేనితో తనకు సత్సంబంధాలున్నాయని, ఆయన పేరును చెప్పగానే తనకు సంతోషం వేసిందని అన్నారు. 2014లో తాము కోడెల పేరును అనుకున్న సమయంలో విపక్ష నేతకు సైతం విషయం చెప్పి, ఆయన సంతకం తీసుకున్నామన్నారు. కానీ, ఈ దఫా అధికార పార్టీ తమను అడుగుతారని భావించామని, అయితే, ఎవరూ తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు.

కనీసం తమలో ఎవరికైనా చెబితే, ప్రపోజ్ చేయాలని అనుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రొటెం స్పీకర్ అయినా, కనీసం 'విపక్షనేత రండి' అని పిలవలేదని, ఇష్టమైతే రండి, లేకుంటే లేదన్నట్టుగా ప్రభుత్వ ప్రవర్తన ఉందని అన్నారు. ఈ విషయాలను తాను ప్రజలకు చెప్పేందుకే క్లారిటీ ఇస్తున్నానని స్పష్టం చేశారు.

More Telugu News