Andhra Pradesh: ఏపీ మంత్రి బాలినేని విజయ యాత్రలో అపశ్రుతి.. టపాసులు పడి పొగాకు ట్రేడింగ్ కేంద్రం దగ్ధం

  • ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడులో ఘటన
  • టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న అభిమానులు
  • కాలిబూడిదైన రూ.10 లక్షల పొగాకు

ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విజయ యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆయన మద్దతుదారులు కాల్చిన టపాసుల నిప్పు రవ్వలు పడి ఓ పొగాకు ట్రేడింగ్ కేంద్రం కాలి బూడిదైంది. బుధవారం రాత్రి ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడులో ఈ ఘటన జరిగింది. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి భారీ ఊరేగింపుతో ఒంగోలు బయలుదేరారు. ఈ క్రమంలో ఏడుగుండ్లపాడు వద్ద ఆయన అభిమానులు ఆనందంతో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.

వారు కాల్చిన టపాసులు పక్కనే ఉన్న మురళి పొగాకు ట్రేడింగ్ కేంద్రంలో పడడంతో అందులోని పొగాకు అంటుకుని ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే కేంద్రం బుగ్గి అయింది. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారొచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో పది లక్షల రూపాయల విలువ చేసే పొగాకు కాలి బూడిదైనట్టు నిర్వాహకులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

More Telugu News