cab driver: ఓవర్ యాక్టింగ్ చేసిన క్యాబ్ డ్రైవర్.. ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ!

  • ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఘటన
  • తక్కువ దూరానికే బుక్ చేశారని డ్రైవర్ అసహనం
  • గుండెనొప్పి వచ్చిందంటూ సరికొత్త డ్రామా
  • ఇంటర్నెట్ లో పేలుుతున్న జోకులు

ఓ ప్రయాణికురాలు తక్కువ దూరం క్యాబ్ బుక్ చేయడంతో డ్రైవర్ సరికొత్త నాటకానికి తెరతీశాడు. తనకు గుండెనొప్పి వచ్చిందంటూ మార్గమధ్యంలో ఆమెను వదిలి పారిపోయాడు. ఈ విషయమై బాధితురాలు సంస్థకు ఫిర్యాదు చేయడంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చోటుచేసుకుంది. సిడ్నీ ఎయిర్ పోర్టులో దిగిన ఓ మహిళా ప్రయాణికురాలు 11.5 మైళ్ల దూరంలో ఉన్న అన్నాడీలే ప్రాంతానికి ‘13 క్యాబ్స్’ కంపెనీ కారును బుక్ చేసింది.

అయితే ఈ బుకింగ్ కారణంగా తక్కువ మొత్తం మాత్రమే వస్తుందని అసంతృప్తిగా లోనయ్యాడు. చివరికి ఎలాగోలా ఆమెను ఎక్కించుకుని మార్గమధ్యంలో వాహనాన్ని ఆపేశాడు. తనకు గుండెలో నొప్పిగా ఉందనీ, తాను వెళ్లలేనని స్పష్టం చేశాడు. ఛాతి పట్టుకుని అక్కడే కూలబడిపోయాడు. ‘నన్ను ఇక్కడ వదిలేస్తే నేను ఎలా వెళ్లాలి?’ అని బాధితురాలు అడగ్గా.. 'ఒకవేళ ఈ బాధతో నేను డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ జరిగితే బాధ్యత ఎవరిది మేడమ్?' అంటూ ఎదురు ప్రశ్నించాడు.

ఈ తతంగం మొత్తాన్ని ఫోన్ లో రికార్డు చేసిన సదరు మహిళ ఆ వీడియోను మీడియాకు, క్యాబ్స్ 13 యాజమాన్యానికి అందించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కంపెనీ, సదరు డ్రైవర్ ను విధుల నుంచి తొలగించింది.  మరోవైపు ఈ డ్రైవర్ చేసిన నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ నెటిజన్లు జోకులు వేస్తున్నారు.

More Telugu News