cm: సీఎం జగన్ ని మీరు ఇప్పుడు కలుస్తారా? అన్న ప్రశ్నకు రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

  • పిలిస్తే కలుస్తాను 
  • ఇప్పటి వరకైతే నన్నెవరూ పిలవలేదు
  • నాకు చిన్నప్పటి నుంచి ‘కులం’ పై వ్యామోహం లేదు

వైసీపీ ఎమ్మెల్యే  రోజాకు మంత్రి పదవి లభిస్తుందని ఆ పార్టీ నేతలు సహా చాలా మంది ఊహించిన విషయం తెలిసిందే. అయితే, ఏపీ కేబినెట్ లో ఆమెకు స్థానం దక్కలేదు. ఈ రోజు విజయవాడకు వచ్చిన రోజాను మీడియా పలకరించింది. ‘సీఎం జగన్ గారిని మీరు ఇప్పుడు కలుస్తారా?’ అని ప్రశ్నించగా, ‘పిలిస్తే కలుస్తాను’ అని, ఇప్పటి వరకైతే తనను ఎవరూ పిలవలేదని రోజా స్పష్టం చేశారు.

ఏపీ కేబినెట్ లో ఆమెకు స్థానం దక్కకపోవడంపై రోజా మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు కదా, ఆ సమీకరణల నేపథ్యంలో మంత్రి పదవి తనకు రాలేదేమోనని అభిప్రాయపడ్డారు. వైసీపీకి చెందిన కాటసాని రామ్ భూపాల్ రెడ్డి తాను ‘రెడ్డి’గా కాకుండా ఏ ‘ఎస్సీ’గానో, ‘బీసీ’గానో పుట్టుంటే తనకు మంత్రి పదవి వచ్చి ఉండేదన్న వ్యాఖ్యలను రోజా వద్ద విలేకరులు ప్రస్తావించారు.

‘మీరు కూడా ‘రెడ్డి’ కనుక ఆ ఈక్వేషన్ లోనే మాట్లాడతారా?’ అనే ప్రశ్నకు రోజా సమాధానమిస్తూ, ‘నాకు చిన్నప్పటి నుంచి ‘కులం’పై వ్యామోహం లేదు. నేను పెళ్లి చేసుకుంది కూడా ‘బీసీ’ నే. నా ఫ్రెండ్స్ అందరూ కూడా వేర్వేరు క్యాస్ట్ ల వాళ్లే. నా పీఏలు, అసిస్టెంట్స్ వేరే క్యాస్ట్ ల వాళ్లే, ‘రెడ్లు’ ఎవరూ లేరు. నాకు ఎప్పుడు కూడా కులం గురించి ఆలోచించే అవకాశం రాలేదు. మరి, ఫస్ట్ టైమ్ కులసమీకరణలు అంటున్నారు. ఓకే, అది కూడా మంచిదే, వాళ్లకు కూడా అవకాశమివ్వడం’ అని అన్నారు.

More Telugu News