Andhra Pradesh: 2024 నాటికల్లా ఏపీలో సమగ్ర విద్యావిధానం తెస్తాం!: విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

  • ఫీజుల నియంత్రణను లక్ష్యంగా పెట్టుకున్నాం
  • మధ్యాహ్న భోజనం పరిశుభ్రంగా, రుచిగా ఉండేలా చర్యలు
  • ఇబ్రహీంపట్నంలో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి

ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణే లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం రుచికరంగా, పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2024 నాటికి ఏపీలో సమగ్ర విద్యావిధానం తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని విద్యాశాఖ కార్యాలయంలో మంత్రి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం చేపట్టే ప్రతీ పనిని గణాంకాలతో సహా ప్రజల ముందు ఉంచుతామని సురేష్ తెలిపారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా ముందుకు వెళతామని పునరుద్ఘాటించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా డీఈవోలు, ఎంఈవోలు చర్యలు తీసుకోవాలని సూచించారు.

విద్యాశాఖలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఫిర్యాదు చేయవచ్చనీ, అందరి సలహాలు, సూచనలతో ముందుకు వెళతామని స్పష్టం చేశారు. రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజన్న బడిబాట కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని సూచించారు.

More Telugu News