doctors: మమ్మల్ని జైలుకు పంపొద్దు.. కోర్టులో కన్నీరు పెట్టుకున్న 'డాక్టర్ పాయల్ తాడ్వీ' ఆత్మహత్య కేసు నిందితులు

  • సీనియర్ల వేధింపులు భరించలేక తాడ్వీ పాయల్ ఆత్మహత్య
  • దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు
  • నిందితుల కస్టడీని పొడిగించిన కోర్టు

డాక్టర్ తాడ్వీ పాయల్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా వైద్యులు హేమా అహుజా, భక్తి మెహర్, అకింత ఖండేల్‌వాల్‌లు కోర్టులో కన్నీరు పెట్టుకున్నారు. తమను తిరిగి జైలుకు పంపొద్దని వేడుకున్నారు. నిందితులు ముగ్గురు ఈ నెల మొదట్లో పెట్టుకున్న బెయిలు పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ నెల 17కు విచారణను వాయిదా వేసింది. దీంతో నిందితులు ముగ్గురినీ జుడీషియల్ కస్టడీకి తరలించారు.

ఈ కేసుతో తమకు ఎటువంటి ప్రమేయం లేదని, తమను జైలుకు పంపడం న్యాయం కాదంటూ కోర్టు హాలులో కన్నీరు పెట్టుకున్నారు. కాగా, సోమవారంతో వీరి కస్టడీ ముగియడంతో జైలు అధికారులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వీరి కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది.

ముంబైలో గైనకాలజీ రెండో ఏడాది చదువుతున్న డాక్టర్ తాడ్విని ముగ్గురు సీనియర్లు దారుణంగా ర్యాగింగ్ చేశారు. అవమానిస్తూ, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ ర్యాగింగుకు పాల్పడ్డారు. వారి వేధింపులు భరించలేక తాడ్వి ఆత్మహత్యకు పాల్పడింది. తాడ్వి ఆత్మహత్య దేశాన్ని కుదిపేసింది. ఆమె ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

దీంతో దిగివచ్చిన పోలీసులు గత నెల 29న ముగ్గురినీ అరెస్ట్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు.. నిందితులను విచారించాల్సి ఉందని, వారిని తమకు అప్పగించాలని కోర్టును కోరారు. అయితే ఆ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. కాకపోతే కొన్ని గంటలపాటు మాత్రం విచారించేందుకు అంగీకరించింది.

More Telugu News