Andhra Pradesh: ఏపీ కేబినెట్ నిర్ణయాలు..‘అగ్రిగోల్డ్’ బాధితుల కోసం రూ.1150 కోట్లు కేటాయింపు

  • రూ.20 వేల లోపు డిపాజిట్ దారులకు  తక్షణం లబ్ధి
  • ప్రభుత్వ పథకాలను గ్రామ వాలంటీర్ల ద్వారా చేరవేస్తాం
  • ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్: మంత్రి పేర్ని నాని

ఏపీ కేబినెట్ తొలి సమావేశం ముగిసింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వివరించారు. ‘అగ్రిగోల్డ్’ బాధితుల కోసం రూ.1150 కోట్లు కేటాయించాలని, రూ.20 వేల లోపు డిపాజిట్లు చేసిన తొమ్మిది లక్షల మందికి తక్షణం లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రతి గడపకూ ప్రభుత్వ పథకాలను గ్రామ వాలంటీర్ల ద్వారా చేరవేస్తామని, వీటిని అమలు చేసేందుకు ప్రతి యాభై ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ ను నియమిస్తామని, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. ఆగస్టు 15 కల్లా గ్రామ వాలంటీర్లను నియమించేందుకు చర్యలు చేపట్టేలా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గ్రామాల్లో వాలంటీర్ కు విద్యార్హత ఇంటర్, మున్సిపల్ వార్డు వాలంటీర్ కు డిగ్రీ పాసై ఉండాలని వివరించారు.

రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని, రైతులకు ఉచిత బోర్లు వేసేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 200 రిగ్గులు అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్టు చెప్పారు. పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసే ఏర్పాటు చేయాలని, పంటల బీమాకు సంబంధించిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని, ఏదైనా పంటకు నష్టం జరిగితే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టు నాని వివరించారు.

More Telugu News