Sanji Ram: కథువా బాలిక హత్యాచార ఘటనలో ముగ్గురికి జీవితఖైదు

  • గుర్రాలను మెపుతూ జీవించే బక్రవాల్ తెగ
  • గ్రామస్థులకు, తెగకు మధ్య విభేదాలు
  • కక్ష పెంచుకున్న మాజీ రెవెన్యూ అధికారి సాంజీరామ్
  • చిన్నారి ఎత్తుకెళ్లి గుడిలో బంధించి అత్యాచారం
  • బండరాయితో మోదీ హత్య చేసి అడవిలో పడేశారు

ఏడాదిన్నర  క్రితం జమ్మూ కశ్మీర్‌లోని కథువాలో 8 ఏళ్ల బాలికపై అత్యాచార, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ  కేసుకు సంబంధించిన తీర్పును నేడు పఠాన్‌కోట్ న్యాయస్థానం వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాంజీరామ్, ముగ్గురు పోలీసులు సురేందర్ వర్మ, దీపక్ ఖజూరియా, తిలక్ రాజ్‌తో పాటు మరో ఇద్దరిని దోషులుగా కోర్టు తేల్చింది. అయితే సాంజీ రామ్ కుమారుడు విశాల్‌ను మాత్రం నిర్దోషిగా పేర్కొంది. వీరిలో ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. సాంజీరామ్, పరమేశ్, ఖజూరియాలకు జీవిత ఖైదు విధిస్తూ పఠాన్‌కోట్ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ముగ్గురు పోలీసు అధికారులకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

కథువాలోని రాసానా గ్రామంలో బక్రవాల్ అనే సంచార తెగ వాసులు గుర్రాలను మేపుకుంటూ ఉంటారు. ఈ తెగకు, గ్రామస్థులకు మధ్య భూముల వ్యవహారం, పొలాల్లో గుర్రాలను మేపే విషయంలో విభేదాలు తలెత్తాయి. దీంతో రెవెన్యూ శాఖ మాజీ ఉద్యోగి అయిన సాంజీ రామ్ ఈ తెగపై కక్ష పెంచుకుని వారిని గ్రామం నుంచి తరిమివేయాలని పథక రచన చేశాడు. దీనిలో భాగంగానే గుర్రాలు మేపేందుకు వెళ్లిన 8 ఏళ్ల చిన్నారిని 2018 జనవరి 10న ఎత్తుకెళ్లి సమీపంలోని గుడిలో బంధించారు. అక్కడ ఆ చిన్నారికి వారం రోజులపాటు మత్తు మందు ఇచ్చి సాంజీరామ్, ఇతరులతో కలిసి వంతులవారీగా అత్యాచారం జరిపారు. అనంతరం బాలికను రాయితో కొట్టి చంపి అడవిలో పడేశారు.

ఈ దారుణాన్ని బయటకు రాకుండా చేసేందుకు సాంజీరామ్ స్థానిక పోలీసులకు పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చాడు. అయితే ఈ ఉదంతం బయటకు పొక్కడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సరిగ్గా వారం తర్వాత జనవరి 17న గ్రామానికి సమీపంలోని ఓ అటవీ ప్రాంతంలో చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిర్వహించగా బాలికపై అతి దారుణంగా సామూహిక అత్యాచారం జరిగినట్టు తెలిసింది. ఈ కేసులో సాంజీరామ్ సహా ఏడుగురిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. వీరిలో ఆరుగురిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం ముగ్గురికి జీవిత ఖైదు, మరో ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

More Telugu News