Rape: అత్యాచారాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన యూపీ మంత్రి ఉపేంద్ర తివారీ!

  • పురుషులపై తప్పుడు కేసులు పెడుతున్నారు
  • అత్యాచారాల తీరుపై ఎన్నో సందేహాలు
  • వైరల్ అవుతున్న ఉపేంద్ర తివారీ వ్యాఖ్యల వీడియో

తమకు నచ్చిన వారితో ఏడెనిమిదేళ్లు వివాహేతర సంబంధాన్ని పెట్టుకుని, ఆపై తమను అత్యాచారం చేశారంటూ పురుషులపై కేసులు పెడుతున్నారని ఉత్తరప్రదేశ్ నీటి పారుదల, నీటి వనరుల శాఖా మంత్రి ఉపేంద్ర తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేప్ జరిగే తీరుపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఓ మైనర్ పై అత్యాచారం జరిగితే, దాన్ని రేప్ గా పరిగణించవచ్చని, 30 నుంచి 35 ఏళ్ల వయసున్న మహిళ వచ్చి తనను రేప్ చేశారంటే నమ్మడమెలాగని ప్రశ్నించారు.

మంత్రి వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యాచార ఘటన తన దృష్టికి వస్తే, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే స్పందిస్తున్నారని, కఠిన చర్యలకు ఆదేశిస్తున్నారని ఉపేంద్ర తివారీ వ్యాఖ్యానించారు. కాగా, ఈ నెలారంభంలో అలీగఢ్ వద్ద రెండు సంవత్సరాల చిన్నారి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి చెత్తకుండీల్లో వేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.

More Telugu News