Pawan Kalyan: నాకు వచ్చిన ప్రతి ఓటు వంద ఓట్లతో సమానం: పవన్ కల్యాణ్

  • ఎందుకు ఓడియారని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు
  • ఇప్పటివరకు నా ఆశయాలే చూశారు
  • ఇకపై నా రాజకీయాలు కూడా చూస్తారు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల్లో తమ పార్టీ పరిస్థితిపై ప్రాంతాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవాళ రాయలసీమ ప్రాంత నేతలతో సమావేశమైన పవన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "ప్రతి ఒక్కరూ మీరు ఎందుకు ఓడిపోయారని అడుగుతున్నారు. వారందరికీ చెప్పేది ఒక్కటే. నేను ఓడిపోయానని అనుకోవడంలేదు. నాకు వచ్చిన ప్రతి ఓటు వంద ఓట్లకు సమానం. జనసేన పార్టీ సీట్లు గెలవకపోయినా, స్వచ్ఛమైన రాజకీయాలతో ప్రజల మనసులు గెలుచుకుంది. సమస్యల పరిష్కారం కోసం జనసేన ఉంది. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీతో ఏకీభవించే ప్రసక్తేలేదు. ప్రధాని నరేంద్ర మోదీ అంటే గౌరవం ఉంది కానీ భయం మాత్రం లేదు" అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు.

కాగా, పార్టీ నేతలతో ముచ్చటిస్తూ కూడా పవన్ కొన్ని కీలక వ్యాఖ్యలు  కూడా చేశారు. తనను ఓడించడానికి రూ.150 కోట్లు ఖర్చు చేశారంటూ ఆరోపించారు. ఒక్క వీరవాసరం మండలంలోనే రూ.30 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిసిందని అన్నారు. ఇప్పటివరకు తన ఆశయాలనే చూశారని, ఇకపై తన రాజకీయాలు కూడా చూస్తారని ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపారు. దెబ్బకు దెబ్బ తీస్తానంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఓ వీడియో జనసేన పార్టీ ట్విట్టర్ అకౌంట్ లో హల్ చల్ చేస్తోంది.

More Telugu News