కొనసాగుతున్న భట్టి విక్రమార్క విలీన వ్యతిరేక దీక్ష

09-06-2019 Sun 11:14
  • ఇందిరాపార్క్‌ వద్ద ‘ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం’
  • రెండో రోజుకి చేరిన నిరశన
  • నిరవధిక దీక్షగా మారిన 36 గంటల ఆందోళన
తెలంగాణలోని కాంగ్రెస్‌ శాసన సభ్యులను మూకుమ్మడిగా టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ సీఎల్పీ నాయకుడు మల్లు భట్టివిక్రమార్క చేపట్టిన నిరశన దీక్ష రెండో రోజుకి చేరుకుంది. ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద ‘ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం’ పేరుతో  36 గంటల దీక్ష చేపడుతున్నట్లు భట్టివిక్రమార్క తొలుత ప్రకటించారు. అయితే భట్టికి సంఫీుభావంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి దీక్షకు దిగాక పరిణామాలు మారాయి. భట్టి నిరవధిక దీక్ష చేస్తారని వేదిక మీది నుంచే ఉత్తమకుమార్‌రెడ్డి ప్రకటించారు.

కాగా, టీఆర్‌ఎస్‌ చర్యపై కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా మండిపడ్డారు. ఎమ్మెల్యేంతా ఒకేసారి పార్టీ మారకపోయినా విలీనం చేశారన్నారు. ముఖ్యంగా ఒక దళిత నాయకుడు లెజిస్లేటివ్‌ పార్టీ నాయకుడిగా ఉండడం ఇష్టంలేని కేసీఆర్‌ ఇటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.