Guntur District: ఖాకీ దర్పం...డీజిల్‌ పోయలేదని పెట్రోల్‌ బంక్‌ కుర్రాడిని చితకబాదిన ఎస్‌ఐ

  • యజమాని చెబితే పోస్తానని అనడమే నేరమైంది
  • స్టేషన్‌ నుంచి వచ్చి మరీ చెయ్యి చేసుకున్న ఎస్‌ఐ
  • గుంటూరు జిల్లా నిజాంపట్నంలో ఘటన

శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యతగల పదవిలో ఉన్నందున హుందాగా, ఆదర్శంగా ఉండాల్సిన ఆ ఎస్‌ఐ స్థాయి మరిచి క్షణికావేశంతో ఓ కుర్రాడిని చితకబాది విమర్శలపాలయ్యాడు. అడిగినంతనే వాహనానికి డీజిల్‌ పోయక పోవడం బాధితుడి తప్పయిపోయింది. గుంటూరు జిల్లా నిజాంపట్నం పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బాధితుని కథనం ఇలావుంది.

నిజాంపట్నం ఎస్‌ఐగా పనిచేస్తున్న ఎం.రాంబాబు తన వాహనానికి డీజిల్‌ కొట్టించుకు రావాల్సిందిగా స్థానికంగా ఉన్న ఓం నమఃశివాయ పెట్రోల్‌ బంక్‌కు పంపించారు. డ్రైవర్‌ వచ్చి బంక్‌లో ఉన్న హుమయూన్‌ అనే కుర్రాడిని డీజిల్‌ పోయాలని ఎస్‌ఐ మాటగా చెప్పాడు. దీనికి ఆ కుర్రాడు సమాధానమిస్తూ తన యజమానికి చెప్పాలని, ఆయన పోయమంటే పోస్తానని తెలిపాడు. ఇదే విషయాన్ని డ్రైవర్‌ సెల్‌ ఫోన్‌లో ఎస్‌ఐకి తెలియజేశాడు. వెంటనే డ్రైవర్‌ను వెనక్కి రమ్మనమని పిలిచి అదే వాహనంలో బంక్‌కు వచ్చిన ఎస్‌ఐ హుమయూన్‌ను విచక్షణా రహితంగా బాదాడు.

ఇదే విషయాన్ని ఎస్‌ఐ రాంబాబు వద్ద ప్రస్తావించగా తాము నెలకోసారి డీజిల్‌ బిల్లు బంక్‌ యజమానికి చెల్లిస్తామని, ఇదే విషయాన్ని డ్రైవర్‌ సదరు కుర్రాడికి చెప్పినా దురుసుగా ప్రవర్తించడమేకాక దుర్భాషలాడాడని తెలిపారు. కాగా, ఎస్‌ఐ దురుసు ప్రవర్తనను నిరసిస్తూ బంక్‌ సిబ్బంది స్టేషన్‌ ఎదుట బైఠాయించారు.

More Telugu News