TV9: రూ. 99 వేలకు టీవీ9 లోగోను మోజో టీవీకి విక్రయించిన రవిప్రకాశ్... బెయిలా? జెయిలా? తేలేది రేపే!

  • ఐదు గంటల పాటు సాగిన విచారణ
  • ముక్తసరి సమాధానాలతో సరిపెట్టిన రవిప్రకాశ్
  • రేపు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్, చానెల్ ట్రేడ్ మార్క్ ను కేవలం రూ. 99 వేలకు మోజో టీవీకి అక్రమంగా విక్రయించారన్న అంశంపై బంజారాహిల్స్ పోలీసులు ఆయన్ను దాదాపు ఐదు గంటల పాటు విచారించగా, కేవలం ముక్తసరి సమాధానాలతో రవిప్రకాశ్ సరిపెట్టినట్టు తెలుస్తోంది. ఆయన విచారణకు సహకరించడం లేదని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఇక రవిప్రకాశ్ వేసిన మరో బెయిల్ పిటిషన్ పై సోమవారం నాడు హైకోర్టులో విచారణ జరగనుండగా, బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించిన పక్షంలో వెంటనే, నోటీసులు ఇచ్చి, రవిప్రకాశ్ ను అరెస్ట్ చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు సమాచారం. కోర్టు తీర్పును అనుసరించి తమ నిర్ణయం ఉంటుందని, ముందస్తు బెయిల్ మంజూరైతే మాత్రం రవిప్రకాశ్ కు పెద్ద ఊరట లభించినట్లని వ్యాఖ్యానిస్తున్నారు. గత మంగళవారం నుంచి రవిప్రకాశ్ ను నిత్యమూ పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఫోర్జరీ, చీటింగ్ తదితర ఆరోపణలపై ఆయనపై కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి.

More Telugu News