Nissan showroom: రూ.2 లక్షలు చెల్లించి రూ.18.6 లక్షల విలువైన కారును ఎత్తుకుపోయిన ఘనుడు!

  • టెస్ట్ డ్రైవింగ్ కోసం కారును తీసుకెళ్లిన నిందితుడు
  • నాలుగు నెలలైనా వెనక్కి రాని వైనం
  • తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసిన షోరూం యాజమాన్యం

సూటు, బూటు వేసుకున్న ఓ వ్యక్తి దర్జాగా నడుచుకుంటూ నిస్సాన్ కార్ల షోరూంలోకి వెళ్లాడు. ఎస్‌యూవీ కావాలని చెప్పాడు. డౌన్‌పేమెంట్‌ కింద రూ.2 లక్షలు చెల్లించాడు. ఆపై టెస్ట్ డ్రైవింగ్ కోసమంటూ కారును బయటకు తీసుకెళ్లాడు. అలా వెళ్లిన వ్యక్తి కోసం నాలుగు నెలలపాటు ఎదురుచూసినా తిరిగి వెనక్కి రాకపోవడంతో  తాజాగా షోరూం యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. బెంగళూరులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం..

నగరంలోని దొడ్డనెకుండిలో ఉన్న సూర్య నిస్సాన్ షోరూంలోకి జనవరి 23న సాయంత్రం 6:30 గంటలకు జోస్ థామస్ అలియాస్ జోసెఫ్ అనే వ్యక్తి వచ్చాడు. నిస్సాన్ కిక్స్ వాహనం గురించి వివరాలు తెలుసుకున్నాడు. ఈ ఎస్‌యూవీ ధర రూ.18.6 లక్షలు కాగా రెండు లక్షల రూపాయలను డౌన్‌పేమెంట్‌గా చెల్లించాడు. ఆ తర్వాత టెస్ట్ డ్రైవింగ్ కోసమంటూ వాహనాన్ని బయటకు తీసుకెళ్లాడు.

అలా వెళ్లిన వ్యక్తి నేటికీ తిరిగి రాలేదంటూ షోరూం మేనేజర్ గణేశ్ కుమార్ శెట్టి గత నెల 21న హెచ్ఏఎల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తాజాగా ఈ కేసును మహాదేవపుర పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఫోన్ చేస్తే ఎత్తడం లేదని, ఆఫీసులో కూడా లేడని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జోసెఫ్ నంబరును ట్రేస్ చేసే పనిలో పడ్డారు.

More Telugu News