kerala: భానుడి ప్రతాపానికి బై బై.. 13న తెలంగాణలోకి రుతుపవనాలు!

  • శనివారం కేరళను తాకిన రుతుపవనాలు 
  • చాలా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
  • నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు

వేసవి తాపానికి ఇక చెక్ పడినట్టే. వారం రోజులు ఆలస్యంగా కేరళను తాకిన రుతుపవనాలు మరో నాలుగు రోజుల్లో తెలంగాణలో ప్రవేశించనున్నాయి. రుతు పవనాలు కేరళను తాకడంతో వానాకాలం ఆరంభమైనట్టే. శనివారం కేరళను తాకీ తాకగానే చాలా జిల్లాలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. దీంతో ఇన్నాళ్ల భానుడి భగభగలకు చెక్ పడినట్టు అయింది.

నిజానికి ఈ నెల 1నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాల్సి ఉంది. అయితే, వాటి రాక వారం రోజులు ఆలస్యమైంది. కేరళలో 14 వాతావరణ పరిశీలన కేంద్రాలున్నాయి. వీటిలో కనీసం 60 శాతం ప్రాంతాల్లో రెండు రోజులపాటు 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే రాష్ట్రంలోకి రుతుపవనాలు వచ్చినట్టుగా భారత వాతావరణ శాఖ ప్రకటిస్తుంది.  

ఇక, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలపై 1500 మీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజులపాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, శనివారం కేరళను తాకిన రుతుపవనాలు ఈ నెల 13న అంటే  గురువారం తెలంగాణను తాకే అవకాశం ఉందని పేర్కొంది.  

More Telugu News