Jana Sena: అదేమీ చిన్నవిషయం కాదు: 'జనసేన' లక్ష్మీనారాయణ

  • నన్ను 2,88,754 మంది ఆశీర్వదించారు
  • రాష్ట్రంలో మార్పుమొదలైంది
  • ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని కలుస్తాం

జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ విశాఖ జిల్లా అభ్యర్థులతో సమావేశమయ్యారు. మంగళగిరిలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ కోర్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ముఖ్యనేతలు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్, మాదాసు గంగాధరం తదితరులు పవన్ తో సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మార్పు ప్రారంభమైందని, భవిష్యత్తులో జనసేన పార్టీ పుంజుకుంటుందని అన్నారు.

ఎన్నికల్లో గెలవకపోయినా, తనను 2,88,754 మంది ఓటుతో ఆశీర్వదించారని తెలిపారు. పార్టీ పరంగా కూడా కొద్దిసమయంలోనే ఇంత పురోగతి సాధించడం మామూలు విషయం కాదన్నారు. ఇక, సమీక్ష గురించి చెబుతూ, ఈసారి ఎన్నికల్లో జనసేనలో లోపాలు ఎక్కడెక్కడ వచ్చాయి అనే విషయాన్ని పవన్ కల్యాణ్ అందరితో చర్చించారని తెలిపారు. జనసేన ప్రతిపాదించిన జీరో బడ్జెట్ పాలిటిక్స్ యువతలోకి వెళ్లిందని, ధనప్రభావం లేని రాజకీయాలపై యువతలో ఆసక్తి మొదలైందని అన్నారు.

గతంలో తాను రైతులను కలిసేందుకు పాదయాత్ర చేశానని, ఇకముందు కూడా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వద్దకు కూడా వెళతామని సీబీఐ మాజీ జేడీ స్పష్టం చేశారు.

More Telugu News