Kuntia: కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఒక్కసారిగా పార్టీని వీడలేదు: కుంతియా

  • బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి పార్టీలో చేర్చుకున్నారు
  • ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరాం
  • గవర్నర్ కు విజ్ఞప్తి చేసినా స్పందించడంలేదు

కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేసుకోవడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు కారాలుమిరియాలు నూరుతున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్నది కేసీఆర్ ప్లాన్ అంటూ మండిపడుతున్నారు. తాజాగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి ఆర్సీ కుంతియా కూడా ఘాటుగా స్పందించారు. టీఆర్ఎస్ అక్రమంగా తమ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుందని విమర్శించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఒక్కసారిగా పార్టీ వీడలేదని, వారిని భయపెట్టి, ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకున్నారని కుంతియా ఆరోపించారు. కేసీఆర్ అప్రజాస్వామిక ధోరణులను ప్రోత్సహిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్ ను కలిసినా సరైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల విషయంలో కోర్టును ఆశ్రయించగా, కేసు ఈ నెల 11కి వాయిదా పడిందని వివరించారు. ఓవైపు కేసు పెండింగ్ లో ఉండగానే ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్నారంటూ కుంతియా ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News