Andhra Pradesh: ఏపీ మాజీ స్పీకర్ కోడెల కుమారుడిపై కేసు నమోదు!

  • నరసరావుపేటలో బలవంతపు వసూళ్లు
  • పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
  • అపార్ట్ మెంట్ నిర్మాణానికి రూ.17 లక్షలు డిమాండ్

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామ్ పై కేసు నమోదయింది. శివరామ్, ఆయన అనుచరులు మామూళ్లు ఇవ్వాల్సిందిగా బెదిరిస్తున్నారని కె.మల్లికార్జునరావు అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుతో గుంటూరు వన్ టౌన్ పోలీసులు ఈరోజు కేసు నమోదుచేశారు. ఈ విషయమై మల్లికార్జునరావు మాట్లాడుతూ..‘నరసరావుపేట శివారు రావిపాడు గ్రామ పంచాయతీ పరిధిలో అపార్ట్‌మెంట్‌ నిర్మించేందుకు అనుమతుల కోసం నేను ఇంజనీర్ వేణును సంప్రదించాను. ఈ సందర్భంగా అతను కోరిన నగదును అందజేశాను. కానీ అతను అనుమతులు ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ వచ్చాడు.

చివరికి భవన నిర్మాణం సగం పూర్తయ్యాక కోడెల కుమారుడు శివరామ్ కు కప్పం చెల్లిస్తేనే భవన నిర్మాణం పూర్తి అవుతుందని ఇంజనీర్ వేణు బెదిరించాడు. అయినా నేను పనులు చేపట్టడంతో పంచాయతీ సెక్రటరీ భార్గవ్, ఈవోపీఆర్‌డీ శివసుబ్రహ్మణ్యం అక్కడకు వచ్చి పనులను నిలిపివేశారు. చివరికి నేను ఇంజనీర్ తో కలిసి కోడెల శివరామ్ ఆఫీసుకు వెళ్లాం. అక్కడ శివరామ్ అతని పీఏ గుత్తా నాగశివప్రసాద్ మాట్లాడుతూ..ఒక్కో ఫ్లాట్ కు రూ.50,000 చొప్పున రూ.17 లక్షలు డిమాండ్ చేశారు.

నగదు ఇచ్చాకే పనులు ప్రారంభించుకోవాలని స్పష్టం చేశారు. దీంతో నేను ఎలాగోలా రూ.14 లక్షలు చెల్లించా. అయినా ఇంకా నగదు కోసం నన్ను ఇంజనీర్ వేణు వేధించడం మొదలుపెట్టాడు. దీంతో పోలీసులను ఆశ్రయించాను’ అని బాధితుడు మల్లికార్జున రావు వాపోయాడు. మరోవైపు బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కోడెల తనయుడు కోడెల శివరామ్ తో పాటు అతని పీఏ గుత్తా ప్రసాద్, ఇంజినీర్‌ వేణులపై పోలీసులు కేసు నమోదుచేశారు.

More Telugu News