Ravi prakash: రవిప్రకాశ్‌ను ఏడు గంటలపాటు విచారించిన పోలీసులు.. మళ్లీ సేమ్ సీన్!

  • పొంతనలేని సమాధానాలు చెప్పిన రవిప్రకాశ్
  • డాక్యుమెంట్లు తీసుకుని నేడు మరోమారు రావాలంటూ పోలీసుల ఆదేశం
  • తమ వద్ద ఉన్న ఆధారాలతో రవి ప్రకాశ్ సమాధానాలను పోల్చి చూస్తున్న పోలీసులు

టీవీ9 లోగో విక్రయం విషయంలో ట్రేడ్‌ మార్క్, కాపీ రైట్స్‌ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్‌‌ను శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులు ఏడు గంటలపాటు విచారించారు. అయితే, సైబర్ క్రైం పోలీసుల విచారణలోలానే పొంతనలేని సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో విసిగిపోయిన పోలీసులు సంబంధిత డాక్యుమెంట్లు తీసుకుని శనివారం మరోమారు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం.

టీవీ9 లోగోను మోజో టీవీకి రూ.99 వేలకు అక్రమంగా విక్రయించారని, ఇందుకోసం ఫోర్జరీ పత్రాలు సృష్టించారని, తప్పుడు సంతకాలతో మోసం చేశారంటూ గత నెల 16న  అసోసియేట్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ పి.కౌశిక్‌రావు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రవిప్రకాశ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం ఆయనను విచారించారు.

ఏసీపీ కేఎస్‌ రావ్, ఇన్‌స్పెక్టర్‌ కళింగ్‌రావుతో కూడిన బృందం రవిప్రకాశ్‌ను వివిధ కోణాల్లో ప్రశ్నించింది. రవిప్రకాశ్‌కు, సినీనటుడు శివాజీకి మధ్య జరిగిన కొన్ని ఒప్పందాలు నిజమైనవేనా? టీవీ9 లోగోను కేవలం రూ.99 వేలకే విక్రయించడంలో ఉన్న నిజమెంత? తదితర ప్రశ్నలు సంధించారు. అయితే, లోగోను తానెవరికీ విక్రయించలేదని రవిప్రకాశ్ చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో స్వాధీనం చేసుకున్న ఆధారాలతో విచారణలో రవిప్రకాశ్ చెబుతున్న విషయాలను పోల్చి చూస్తున్నారు.  

More Telugu News