Roja: విజయవాడలోనే అందుబాటులో ఉండాలని రోజాకు జగన్ సూచన!

  • క్యాబినెట్ జాబితాలో రోజా పేరులేని వైనం
  • మంత్రి పదవి వస్తుందని గట్టిగా నమ్మిన రోజా
  • క్యాబినెట్ జాబితా గవర్నర్ కు అందజేసిన సీఎం జగన్

ఏపీ కొత్త క్యాబినెట్ లో ఎవరెవరు ఉంటారన్న దానిపై ఈ సాయంత్రం స్పష్టత వచ్చింది. సీఎం జగన్ తన మంత్రివర్గం జాబితాను గవర్నర్ నరసింహన్ కు సమర్పించడంతో మంత్రి పదవులు దక్కించుకున్నది వీళ్లేనంటూ మీడియాలో ప్రసారమైంది. అయితే, వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరుపొందిన రోజా పేరు మంత్రివర్గంలో లేకపోవడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇవాళ వైసీపీ శాసనసభాపక్ష భేటీ ముగిసిన తర్వాత రోజా మాట్లాడుతూ, తనకు మంత్రి పదవి వస్తుందని 100 శాతం నమ్ముతున్నట్టు తెలిపారు. ఏ మంత్రి పదవి ఇచ్చినా న్యాయం చెయ్యడం, జగన్ కు మంచి పేరు తీసుకురావడమే తన లక్ష్యాలని చెప్పారు. కానీ, క్యాబినెట్  మంత్రుల జాబితాలో రోజా పేరులేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

అయితే, మంత్రివర్గ కూర్పు సమయంలో జగన్ ఇదే విషయమై రోజాతో రెండుసార్లు చర్చించి నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. కొన్ని సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని క్యాబినెట్ కూర్పు చేశామని, అందుకే మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోతున్నామని జగన్ తెలిపినట్టు సమాచారం. అంతేగాకుండా, పార్టీలో ఇన్నాళ్లపాటు రోజా చేసిన సేవలను ప్రస్తావించిన జగన్ ఆమెను విజయవాడలోనే అందుబాటులో ఉండాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో, రోజాకు మరో కీలక పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చాక జగన్ తిరుమల వచ్చినప్పుడు రోజా ప్రతి కార్యక్రమంలోనూ ఆయన వెన్నంటే ఉన్నారు. తద్వారా మంత్రి పదవి రేసులో తాను ముందున్నానని సంకేతాలు పంపారు. అనూహ్యంగా ఆమె పేరు లేకుండానే జగన్ తన క్యాబినెట్ కూర్పు చేయడం రాజకీయ వైచిత్రి!

More Telugu News