Vijayashanti: ప్రజాస్వామ్యాన్ని చంపేసిన కేసీఆర్: విజయశాంతి నిప్పులు

  • అంపైర్ ను అడ్డు పెట్టుకుని మ్యాచ్ గెలిచినట్టుగా ఉంది
  • విలీనం చట్టపరంగా చెల్లుతుందా?
  • టీఆర్ఎస్ అరాచకంగా వ్యవహరిస్తోందన్న విజయశాంతి

టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీని విలీనం చేయడంపై కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి నిప్పులు చెరిగారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. "తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో టిఆర్ఎస్ అధిష్ఠానం వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. రాజ్యాంగాన్ని నమ్మేవారు తలదించుకునే విధంగా ఉంది. అంపైర్ ను అడ్డంపెట్టుకుని వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో గెలవాలి అనుకున్నట్లు... అసెంబ్లీ స్పీకర్ ను అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ లో, కాంగ్రెస్ శాసన సభ పక్షాన్ని విలీనం చేసినట్లు ప్రకటించడం చాలా గర్హనీయం. హాస్యాస్పదం.

ఒక జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర విభాగాన్ని ఒక ఉప ప్రాంతీయ పార్టీలో విలీనం చేయడం అనేది చట్టపరంగా చెల్లుతుందా? అనే ప్రశ్నకు టిఆర్ఎస్ అధిష్ఠానం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో మంది బలం అడ్డం పెట్టుకుని టిఆర్ఎస్ అరాచకంగా వ్యవహరిస్తున్న తీరు ఒక దుస్సంప్రదాయానికి నాంది పలుకుతోంది. ఈ పరిణామాలు టీఆర్ఎస్ మెడకు ఉచ్చుగా బిగుసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అప్పుడు టిఆర్ఎస్ నేతలు అరిచి గీపెట్టినా వినే నాథుడు కూడా కరువు అవుతాడు.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ చేర్చుకోవడంపై తెలంగాణ ఓటర్ల అసంతృప్తి ఏరకంగా ఉందో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. దీన్ని చూసిన తర్వాత కూడా టిఆర్ఎస్ అధిష్ఠానం మైండ్ సెట్ మారకపోవడం దురదృష్టకరం. వేసే ఓట్లు ఏమవుతున్నాయో తెలియని, ఓట్లు వేశాక గెలిచే అభ్యర్థులు ఎటు పోతారో అర్థంకాని అయోమయ అవస్థలో తెలంగాణ ప్రజానీకం సతమతమవుతూ ఉంది" అని విజయశాంతి అభిప్రాయపడ్డారు.

More Telugu News