Priya Sawhney: అందరిముందూ స్టేజ్ ఎక్కి.. అమెజాన్ చీఫ్ పై విరుచుకుపడ్డ ఇండో అమెరికన్ యువతి!

  • 'రీ మార్స్' పేరిట ఏర్పాటైన చర్చా కార్యక్రమం
  • జంతువులకు ఏదైనా చేయాలంటూ వేదికపైకి వచ్చిన ప్రియ
  • బలవంతంగా తీసుకెళ్లిన సెక్యూరిటీ గార్డులు

'రీ మార్స్' పేరిట ఏర్పాటైన చర్చా కార్యక్రమంలో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ పాల్గొని మాట్లాడుతున్న వేళ, జంతు హక్కుల కార్యకర్తగా ఉన్న ఇండో అమెరికన్ యువతి ప్రియా సాహ్నే, స్టేజ్ ఎక్కి ఆయన్ను దులిపేశారు. చర్చా కార్యక్రమం మధ్యలో ఉండగా వేదిక ఎక్కిన 30 సంవత్సరాల ప్రియ, ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. "మీరు ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు. అమెజాన్ కు అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు జంతువుల కోసం ఏదైనా చేయాలి" అని గట్టిగా అన్నారు. అమెజాన్ ఆధ్వర్యంలోని కోళ్ల ఫారాల్లో జంతుహింస జరుగుతోందని ఆరోపించారు.

దీంతో అప్పటిదాకా చలోక్తులు, నవ్వులతో సాగిన చర్చ, సీరియస్ గా మారగా, ఆడిటోరియం సైతం నిశ్శబ్దంగా మారింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వేదికపైకి వచ్చి, ప్రియను కిందకు తీసుకెళ్లారు. ఆపై జెఫ్ బెజోస్ వాతావరణాన్ని తేలికపరుస్తూ, చర్చ సంధానకర్తతో "ఆమె ప్రశ్నకు మీ వద్ద సమాధానం ఉందా?" అని అడిగారు. కాగా, ఆమెను అరెస్ట్ చేశారా? లేదా? అన్న విషయంలో లాస్ వెగాస్ పోలీసులు స్పష్టత ఇవ్వలేదు.

More Telugu News