Nathan Coulter-Nile: విండీస్‌తో మ్యాచ్‌లో కల్టర్ నైల్ ప్రపంచ రికార్డు

  • 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 92 పరుగులు
  • 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన రికార్డు
  • హీత్ స్ట్రీక్ రికార్డు బద్దలు

ప్రపంచకప్‌లో భాగంగా విండీస్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ నాథన్ కల్టర్ నైల్ రికార్డు సృష్టించాడు. నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 79 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే,  స్టీవెన్ స్మిత్ (73), అలెక్స్ కేరీ (45), నాథన్ కల్టర్ నైల్ (92)లు అద్భుతంగా రాణించడంతో ఆస్ట్రేలియా అనూహ్యంగా పుంజుకుని ఏకంగా 288 పరుగులు చేసింది.
 
8వ నంబరు ఆటగాడిగా క్రీజులోకి వచ్చిన 31 ఏళ్ల కల్టర్ నైల్  60 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో నైల్ ఇప్పటి వరకు ఒక్క అర్ధ సెంచరీ కూడా నమోదు చేయనప్పటికీ విండీస్‌తో మ్యాచ్‌లో మాత్రం ప్రపంచ రికార్డు సృష్టించాడు. 92 పరుగులు చేసి కాస్తంతలో సెంచరీ చేజార్చుకున్న నైల్.. 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు జింబాబ్వే ఆటగాడు హీత్ స్ట్రీక్‌ పేరుపై ఉంది. ఇప్పుడా రికార్డును నైల్ బద్దలుగొట్టాడు. 2003లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్ట్రీక్ 8వ నంబరు ఆటగాడిగా క్రీజులోకి వచ్చి 72 పరుగులు చేశాడు.

More Telugu News