Guntur District: ఈ ఎన్నికల్లో మా ఓటమిని ఓ అనుభవంగా తీసుకుంటున్నాం: జనసేన అధినేత పవన్ కల్యాణ్

  • మా పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు
  • ఇన్ని లక్షల మంది మాకు ఓటేయడం మా విజయమే
  • మా పార్టీకి బలమైన క్యాడర్ ఉంది

ఈ ఎన్నికల్లో తమ ఓటమిని ఓటమిగా కాకుండా ఓ అనుభవంగా తీసుకుంటున్నామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు, పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరితో పాటు ‘జనసేన’ పోరాట యాత్ర, ఎన్నికల ప్రచార సభలకు హాజరైన వారికీ తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఓ తీర్మానం చేశారు. నాలుగేళ్ల వయసు గల తమ పార్టీకి ఇన్ని లక్షల మంది ఓటర్లు తమకు ఓటు వేశారంటే అది విజయంగానే భావిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు.

తమ పార్టీని ఎదగనివ్వకూడదని కొన్ని బలీయమైన శక్తులు అడ్డుపడి పని చేయడంతో ఈ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు చూడాల్సి వచ్చిందని అన్నారు. అయితే, తమ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని ఈ ఎన్నికలు నిరూపించాయని, భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు సాధించాలంటే పార్టీ కోసం పని చేసే వారందరూ ఒకే తాటిపై ఉండి, ఒకే ఆలోచనా విధానంతో ముందుకెళ్లాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ (రాజకీయ వ్యవహారాల కమిటీ) కాలం ముగిసిందని, మరికొన్ని రోజుల్లోనే మరో కమిటీని పునర్నియామకం చేయనున్నట్టు పవన్ కల్యాణ్ వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా మరో కమిటీని నియమించనున్నట్టు చెప్పారు.

More Telugu News