Virat Kohli: కోహ్లీని రాజుగా చూపించిన ఐసీసీ.. వెల్లువెత్తుతున్న విమర్శలు

  • ఓ చేత్తో బ్యాట్.. మరో చేత్తో బంతి పట్టుకుని రాజులా ఉన్న కోహ్లీ
  • ఐసీసీ ఇలా పక్షపాతంతో వ్యవహరించడం సరికాదంటూ అభిమానుల మండిపాటు
  • ప్రపంచకప్‌లో భారత్ ఒక్కటే ఆడడం లేదన్న అభిమానులు

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఓ చేత్తో బ్యాట్‌ను కత్తిలా ఎత్తి పట్టుకోగా, మరో చేత్తో బంతి పట్టుకుని సింహాసనంపై రాజులా కూర్చున్న ఫొటోను షేర్ చేసిన ఐసీసీపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు ఈ ఫొటోను షేర్ చేసిన ఐసీసీ విమర్శలు కొని తెచ్చుకుంది.

ఐసీసీ పక్షపాత ధోరణితో వ్యవహరించడం సరికాదంటూ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. తటస్థంగా ఉండాల్సిన ఐసీసీ నుంచి ఇలాంటివి అస్సలు ఊహించలేదని మండిపడుతున్నారు. ప్రపంచకప్‌లో భారత్ ఒక్కటే పాల్గొనడం లేదని, మిగతా జట్ల కెప్టెన్ల సంగతేంటని విరుచుకుపడుతున్నారు. మేమేమైనా జోకర్లలా కనిపిస్తున్నామా? అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, కెప్టెన్‌గా కోహ్లీకి ఇదే తొలి ప్రపంచకప్. ఈ టోర్నీని గెలిచి తానేంటో నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ పెద్దగా ఆకట్టుకోనప్పటికీ రోహిత్ అద్భుత సెంచరీతో భారత్ బోణీ కొట్టింది.

More Telugu News